దిశ ఘటనకు నేటికి ఏడాది పూర్తయింది. లైంగిక దాడి, హత్య ఉదంతం దేశ వ్యాపంగా సంచలనం సృష్టించింది. యావత్ ప్రజానీకాన్ని కన్నీరు పెట్టించింది. నలుగురు దుండగులు ఓ అమాయకురాలిపై అత్యంత కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడి, హత్య చేశారు. అంతటితో ఆగకుండా సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటనతో సభ్య సమాజం నివ్వెరపోయింది. ఈ కేసుల్లో నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, పోలీసులపై ప్రజలు పూల జల్లులు కురిపించారు.
గత ఏడాది నవంబర్ 27వ తేదీన సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ లోని తన ఇంటి నుంచి గచ్చిబౌలికి వెళ్లేందుకు బయలుదేరింది దిశ. అదే రోజు రాత్రి నలుగురు దుండల చేతిలో అత్యంత దారుణంగా లైంగిక దాడికి గురైంది. ఆ కిరాతకులు అంతటి ఆగక షాద్‌నగర్‌లోని చటాన్ పల్లి బ్రిడ్జి కింద దిశ ఒంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహ్మర్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివ ఈ ఘాతుకానికి పాల్పడారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. కేసు రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు ఆయుధాలు లాక్కొని పారిపోయే ప్రయత్నంలో ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు తెలిపారు. మానవ మృగాలు హతమవడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు. అప్పట్లో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. గత ఏడాది డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ఈ ఎన్ కౌంటర్ పై విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తుది నివేదనకు కమిషన్ సుప్రీంకోర్టులో సమర్పించాల్సి ఉంది.
దిశ లైంగిక దాడి, హత్య నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రత్యేకంగా బిల్లును రూపొందించింది. మరో వైపు ఏపీలో 18 పోలీస్ యూనిట్లలో ఒక్కొక్కటి చొప్పున దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, కేసులు ఈ పోలీస్ స్టేషన్లలో పరిష్కరిస్తున్నారు.