వైసీపీ ప్రభుత్వం తనకు తాను రైతు పక్షపాతి అని చెప్పుకుంటోంది. తాజాగా రైతు భరోసా సొమ్ము అందిస్తోంది. అయితే మనకు నిత్యం కనిపించే రైతుల వ్యథలు టమాటా, ఉల్లి రైతులవి. ఈ పంటలు అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్నట్టు తయారవుతున్నాయి. ఒక్కో సమయంలో కేజీ 60-70 పలికే టమాటా.. మరో సమయంలో కేజీ అర్థరూపాయి కూడా పలకడం లేదు.
అదే పరిస్థితి ఉల్లి పంటది కూడా. కానీ ఈ రెండు లేకుండా ఏ ఇంట్లోనూ రోజు గడవదు. అందుకే ఈ రైతులను ఆదుకునేందుకు స్వయంగా జగన్ సర్కారు కదులుతోంది. ఉల్లి,టమాటా వంటి వాణిజ్య పంటల ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వమే మార్కెటింగ్ చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ పంటల్ని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వమే విక్రయిస్తుంది.
ఈమేరకు వ్యవసాయ మిషన్ సమీక్షలో ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్పత్తులు నష్ట పోకుండా శుద్ధి చేసి టమాటో పల్ప్ లాంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టమాటా, ఉల్లిలాంటి పంటలతో పాటు ఇతర వాణిజ్య పంటలకు సంబంధించి కూడా కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకుంటుంది.
అవసరమైన మేరకు మిగిలిన పంటలకు కూడా కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటల్ని సరఫరా చేస్తుంది. దళారీ వ్యవస్థ నివారణకు మార్కెటింగ్ శాఖ సత్వర చర్యలు చేపట్టేందుకు జగన్ ప్రభుత్వం ఆలోచిస్తోందట. రైతుకు మేలు జరిగితే మంచిదే కదా.