తెలంగాణాలో ఆర్టీసి సమ్మె రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. తమ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని దాదాపు నెల రోజుల నుంచి సమ్మె చేస్తున్న ఆర్టీసి కార్మికులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక తర్వాత సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు సమ్మె చేస్తున్న కార్మికులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆర్టీసి కార్మికులు వాళ్ళు కూర్చున్న కొమ్మను వాళ్ళే నరుక్కు౦టున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. ఇక ఆర్టీసి కథే ముగుస్తుందని ఆయన సంచలన వ్యాఖ్య చేసారు.
దీనితో కార్మికుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మొన్న ఖమ్మంలో నిన్న కరీంనగర్ లో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు మృతితో ఆర్టీసీ జేఏసీ నేడు కరీంనగర్ బంద్‌కి పిలుపునిచ్చింది. ప్రభుత్వం చర్చలు జరిపేవరకు బాబు అంత్యక్రియలు నిర్వహించబోమని బిజెపి ఎంపీ బండి సంజయ్ కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే శనివారం ప్రగతి భవన్ లో తెలంగాణా మంత్రి వర్గం కెసిఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం కానుంది. దీనితో ఈ సమావేశంలో కెసిఆర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్టీసి కార్మికుల సమ్మె కొనసాగుతున్న తరుణంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని అమల్లోకి తేవాలని కెసిఆర్ భావిస్తున్నారు… ఆర్టీసీలో సగం యాజమాన్యం బస్సులు, 30 శాతం అద్దె బస్సులు, మిగతా 20 శాతం ప్రైవేట్ స్టేజ్ కేరియర్లు ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో పాటు… ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుమతులు, 4 నుంచి 5 వేల రూట్లలో ప్రైవేట్ స్టేజ్ కేరియర్లకు అనుతులు ఇస్తూ… హైదరాబాద్ మెట్రోరైలుకు సర్వీసుల అనుసంధానం, సెట్విన్ సర్వీసుల సేవలు వినియోగించుకోవడంపై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. శనివారం జరిగే మంత్రి వర్గ సమావేశం కార్మికుల భవిష్యత్తుని నిర్ణయిస్తుందని అంటున్నారు.