కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్‌

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో సోమవారం (29-06-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

top 10 covid 19 updates on june 29th 2020 monday

1. దేశంలో కరోనా మరణాల రేటు 3 శాతం ఉంటే, తెలంగాణలో 1.7 శాతం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. దేశంలో అనేక నగరాల్లో ఉన్నంత కరోనా ఉధృతి హైదరాబాద్‌లో లేదన్నారు. మంగళవారం నుంచి మళ్లీ కరోనా టెస్టులను మొదలు పెడతామని, నగరంలో కరోనా కేసులు ఉన్న చోట కంటెయిన్‌మెంట్‌ జోన్లను పెడతామని తెలిపారు. హైదరాబాద్‌ లాక్‌డౌన్‌పై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

2. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 793 కరోనా కేసులు వచ్చాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 13,891కు చేరుకుంది. తెలంగాణలో ఆదివారం 983 కొత్త కేసులు రాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,419కి చేరుకుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,459 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,48,318కి చేరుకుంది.

3. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్‌ అలీకి కరోనా సోకింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆయనకు కోవిడ్‌ టెస్టు చేయగా సోమవారం ఫలితం వచ్చి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

4. ఢిల్లీలో మరో రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి నుంచి రక్తం సేకరించి అందులోని ప్లాస్మాను వేరు చేస్తారు. అలా వేరు చేసిన ప్లాస్మాను ఆ బ్యాంక్‌లో నిల్వ చేస్తారు. కోవిడ్‌ ఎమర్జెన్సీ పేషెంట్ల చికిత్సకు ఆ ప్లాస్మాను వాడుతారు.

5. భారత్‌లో కోవిడ్‌ బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ప్రస్తుతం కోవిడ్‌ రికవరీ రేటు 58.67 శాతానికి చేరుకుంది. రికవరీ అయిన కేసులు, యాక్టివ్‌ కేసుల మధ్య అంతరం 1,11,602గా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12వేలకు పైగా కోవిడ్‌ బాధితులు రికవరీ అయ్యారు.

6. మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ను జూలై 31వ తేదీ వరకు పొడిగించింది. అదే బాటలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని చూస్తున్నాయి. కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న చోట జూలై 1 నుంచి 15వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్రాలు భావిస్తున్నాయి.

7. కర్ణాటక ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించుకోవచ్చని అనుమతులు జారీ చేసింది. ఒక్కో పీరియడ్‌కు 30 నుంచి 45 నిమిషాల సమయం కేటాయించాలని సూచించింది. వారంలో కేవలం 5 రోజుల పాటు మాత్రమే తరగతులు నిర్వహించాలని చెప్పింది.

8. దేశంలో తయారయ్యే పీపీఈ కిట్లను విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని కేంద్రం పరిశ్రమలకు అనుమతులు ఇచ్చింది. నెలకు 50 లక్షల పీపీఈ కిట్ల వరకు ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది.

9. పాకిస్థాన్‌ నుంచి వచ్చే అన్ని విమానాలను దుబాయ్‌ నిషేధించింది. పాకిస్థాన్‌ నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా ల్యాబ్‌ ఏర్పాటు చేయనంత వరకు ఆ దేశ విమానాలను తమ దేశంలోకి అనుమతించేది లేదని దుబాయ్‌ తెలిపింది.

10. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం జూలై 1వ తేదీని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజు నేషనల్‌ డాక్టర్స్‌ డే అయినందున కోవిడ్‌ పేషెంట్లకు నిరంతరాయంగా చికిత్స అందిస్తూ శ్రమిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవల గౌరవార్థం ఆ రోజును సెలవుదినంగా పాటించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news