టచ్ చేసి చూడు.. నీ ఉద్దేశం ఏంటో చెప్పేస్తదట..!

-

తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని కూడా తెలియని వయసులో ఎందరో చిన్నారులు అఘాయిత్యాలకు బలవుతున్నారు. వీటికి ముఖ్య కారణం.. అవగాహన లేకపోవడం. ఏది మంచి.. ఏది చెడు, చుట్టూ ఉన్నవారిలో ఎవరు మంచివారు. ఎవరు కామాంధులో తెలియకపోవటం. అవకాశం చూసే వారెవరో గుర్తించలేకపోవటం. చిన్నారులపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడానికి వరంగల్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి భరద్వాజ్ మరో ఇద్దరి సహకారంతో వినూత్న ఆలోచనకు నాంది పలికాడు. ఓ ప్రత్యేకమైన బొమ్మను తయారు చేశాడు.

Samskar-Toy

ఆ బొమ్మను తాకినప్పుడు గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ అనే శబ్దాలతో వినిపిస్తాయి. దీనిని మరింత అభివృద్ధి చేసి పాఠశాలల్లో చిన్నారులకు అవగాహన కల్పించాలంటూ.. ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు. దీంతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌తో పాటు షీ-టీమ్, తెలంగాణ స్టేట్‌ తదితర విభాగాలు స్పందించాయి. వరంగల్‌కు చెందిన రూరల్‌ ఇన్నోవేటర్‌ యాకర గణేశ్‌ సహకారంతో ఈ బొమ్మను తయారు చేసినట్లు భరద్వాజ్ తెలిపాడు. దీనికి ‘సంస్కార్‌’ అని నామకరణం చేశారు. ఈ బొమ్మ తయారీకి కొన్ని రకాల సెన్సార్లు, ట్రాన్సిస్టర్లు, స్పీకర్, మైక్రో ప్రాసెసర్లను వినియోగించారు. కొన్ని సందర్భాల్లో ఈ బొమ్మ తాకేందుకు ప్రయత్నించే సమయంలోనే స్పందిస్తుంది. బొమ్మ వేర్వేరు భాగాలను తాకుతున్నప్పుడు ఏది గుడ్‌ టచ్, ఏది బ్యాడ్‌ టచ్‌ అనేది స్పీకర్‌ ద్వారా శబ్దం వెలువడుతుంది.

దీనిపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ స్పందిస్తూ.. ఈ ఆలోచన స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సంస్కార్‌ను మరింత అభివృద్ధి పరచాల్సిందిగా తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేవేషన్‌ సెల్‌కు సూచించారు. దీంతో టీఎస్‌ఐసీ అధికారులు సంస్కార్‌ రూపకర్తలతో భేటీ కానున్నారు. ఈ బొమ్మ స్పందించే తీరును ప్రత్యక్షంగా చూస్తే పిల్లలకు వేగంగా అవగాహన కలుగుతుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిద్వారా అవగాహన కల్పించాలనేది తమ ఉద్దేశం అని భరద్వాజ్, యాకర గణేష్ పేర్గొన్నారు. ముందుగా కొన్ని పాఠశాలల్లో అవగాహన కల్పించి స్పందనను బట్టి అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. ఒక ప్రత్యేకమైన యూనిట్‌ను కూడా తయారు చేస్తామని ఇందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు కావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news