టోల్​ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్.. వాహనదారులకు సజ్జనార్ సలహా ఇదే

-

భాగ్యగనరంలో సంక్రాంతి సందడి షురూ అయింది. నగరమంతా పండుగకు ఊరెళ్తోంది. ఈ క్రమంలో టోల్ ప్లాజాలా వద్ద భారీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడుతోంది. విద్యాసంస్థలకు వారం రోజుల సెలవులు రావడంతో పండగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు తరలిపోతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క పండక్కి వెళ్లేవారు పిల్లాపాపలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. పండుగకు ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి.

సొంతవాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్‌ప్లాజాల వద్ద సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. గంటల తరబడి టోల్‌ప్లాజాల వద్ద నిరీక్షించవద్దని సూచించారు. టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండని సలహానిచ్చారు. టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్లలో వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news