ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల వల్ల నదులు ఉప్పొంగుతున్నాయి. అయితే పిడుగుపాటుకు రాష్ట్రవ్యాప్తంగా 14 మంది మృతి చెందినట్లు అధికారులు నివేదించారు. అలాగే మరో 16 మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. పిడుగుపాటుకు బాందా జిల్లాలో అత్యధికంగా వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు.
పిడుగుపాటుతో మరణించిన కుటుంబాలకు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల నేపథ్యంలో ఇంట్లోనే ఉండాలని సూచించారు.