దసరా గండం.. రైలు రిజర్వేషన్లు దొరక్క ప్రయాణికుల అవస్థలు

-

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నారా.. రైల్లో వెళ్లాలనుకుంటే మాత్రం కష్టపడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే దసరా టికెట్లన్నీ దాదాపుగా బుకింగ్ అయిపోయాయి. రిజర్వేషన్లు దొరకక ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. అక్టోబర్ 5వ దసరా కాగా.. 1న శనివారం కావడంతో నాలుగు రోజుల ముందే ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో టికెట్లు దొరకక అవస్థలు పడుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి అక్టోబరు 1న బయల్దేరే రైళ్లలో దాదాపుగా రిజర్వేషన్లు అయిపోయాయి. ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే కోణార్క్‌, ఈస్ట్‌కోస్ట్‌, గోదావరి, గరీబ్‌రథ్‌, ఎల్‌టీటీ కురుక్షేత్ర, గౌతమి, దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ఒక్కో దాంట్లో వందల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌ల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ పరిమితి దాటిపోయింది. ఈ తేదీల్లో అక్టోబరు 2-4 వరకు విశాఖపట్నం వెళ్లే దురంతో, గరీబ్‌రథ్‌ వంటి ఏసీ రైళ్లలో మాత్రమే కొద్దిమేర టికెట్లున్నాయి.

బెంగళూరు నుంచి విజయవాడ వైపు అక్టోబరు 1న ప్రశాంతి, కొండవీడు, గరీబ్‌రథ్‌, సంఘమిత్ర సహా ఎనిమిది రైళ్లుంటే.. ఏ ఒక్క బండిలోనూ ఖాళీల్లేవు. ఒక్కో రైలులో వందల్లో నిరీక్షణ జాబితా ఉంది. ఒక్క ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లోనే 606 వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. యశ్వంత్‌పుర్‌-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌లో నిరీక్షణ జాబితా 428కి చేరింది. త్రీటైర్‌, టూటైర్‌ ఏసీల్లోనూ నిరీక్షణ పరిమితి దాటిపోయింది.

రాష్ట్రంలో హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మిర్యాలగూడ, కొత్తగూడెం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, కాగజ్‌నగర్‌ వంటి పట్టణాలకు భారీగా వెళతారు. అన్ని జనరల్‌ బోగీలు ఉండే జనసాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైళ్లను నడిపితే ఉపయోగం ఉంటుందని ప్రయాణికులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news