సుదీర్ఘ కాలంగా దేశ వ్యాప్తంగా వద్దు వద్దు అంటున్న రాజద్రోహం కేసులు ఇకపై ఉండవు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం తన నిర్ణయం వెలువరించి సంచలనం రేపింది. ఇప్పటిదాకా ఈ కేసు ద్వారా చాలా మంది జైళ్లలో ఇరుక్కుపోయి ఉన్నారు. వారికి కూడా స్వేచ్ఛ దక్కనుంది. బ్రిటిషర్ల కాలం నాటి రాజద్రోహం అన్నది రద్దు చేస్తే మంచి పాలన అందించవచ్చని, ఆ చట్టంతో కానీ సంబంధిత వివరంతో కానీ భారత్ కు పనేం ఉందని ఎప్పటి నుంచో సుప్రీం అభిప్రాయపడుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో సెక్షన్ 124 (ఎ) కింద కొత్త కేసులు నమోదు కావు. ఓ విధంగా ఇది ఒక గొప్ప నిర్ణయం అని న్యాయ నిపుణులు అంటున్నారు. దేశంలో చాలా చోట్ల చాలా ప్రభుత్వాలు కనీస ఆలోచన లేకుండా ఈ చట్టాన్ని అమలు చేస్తుండడంతో అట్రాసిటీ కేసుల మాదిరిగానే ఇది కూడా పాలకుల ఇష్టా రీతిగా అమలు అవుతుండడం సుప్రీం పునరాలోచనలో పడింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయ స్థానానికి చెందిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆనందాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే దాఖలైన ఎఫ్ఐఆర్-లపై కూడా చర్యలు తీసుకునేందుకు వీల్లేదని సుప్రీం స్పష్టం చేయడంతో సంబంధిత సందిగ్ధత వీడింది. కొన్ని రాష్ట్రాలలో ఉత్తి పుణ్యానికే రాజద్రోహం అమలు చేయడం, ఉత్తి పుణ్యానికే కేసులు బనాయిస్తుండడంతో ఎప్పటి నుంచో దుర్వినయోగం అవుతున్న ఈ చీకటి చట్టం రద్దు పౌర హక్కుల విఘాతం ను నిలువరించినట్లే ! అయిందని సంబంధిత సంఘాలు కూడా చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ చట్టం కింద అరెస్టై జైళ్లలో మగ్గుతున్న వారికి మరో ఉపశమనం ఏంటంటే సమీప న్యాయ స్థానాలను వీరు ఆశ్రయించి వెంట వెంటనే బెయిల్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా కేసులు నమోదు చేసేవిషయమై కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేయాలని సీజేఐ సూచించారు. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం అని కీర్తిస్తూ సీజేఐను ప్రధాన మీడియా ప్రశంసిస్తోంది.
నేషనల్ మీడియాలో దీనిపై మరింత విస్తృత స్థాయిలో చర్చ సైతం జరగనుంది. రాజద్రోహం చట్టంపై కేంద్రం మరోసారి సమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకూ దాని అమలును నిలిపివేయాలని సుప్రీం చెప్పడంతో కీలక రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఓ విధంగా తమకు ఉపశమనం దక్కిందనే భావిస్తున్నాయి. ముఖ్యంగా అధికార దుర్వినియోగం, కక్ష సాధింపు అన్నవి దూరం చేసేందుకు సుప్రీం తీసుకున్న నిర్ణయం ఓ విధంగా ప్రజా స్వామ్య హక్కులను కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది అని ప్రజా హక్కుల సంఘాలు అభిప్రాయం చెబుతూ ఉన్నాయి.