2015 లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమం నేపథ్యంలో కొన్ని లక్షల చెట్లను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపడుతున్నారు తెలంగాణ అధికారులు. మరోవైపు చెట్లను రక్షించడానికి అధికారులు నానా తంటాలు పడుతుంటే మరోవైపు కొందరు చెట్లు అడ్డు వస్తున్నాయని వాటిని నరకడం చేస్తున్నారు. ఇలాంటి వారిపై ఇప్పుడు తెలంగాణ అధికారులు కొరడా జులిపిస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే… సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా 25 సంవత్సరాలుగా ఉన్న రావిచెట్టును నరకడానికి కారణమైన శివకుమార శర్మ అనే వ్యక్తికి పట్టణ మున్సిపల్ అధికారులు ఏకంగా రూ. 30 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమం ప్రత్యేక అధికారి ఐలయ్య మాట్లాడుతూ ఎవరైనా హరితహారం మొక్కలతో పాటు, వారి నివాస ప్రదేశాల్లో లేక వారి సొంత భూములలో పెద్దగా పెరిగిన చెట్లను నరకాలంటే కచ్చితంగా అధికారుల అనుమతి తీసుకోవాలని తెలిపారు. అలా కాకుండా వారు స్వతహాగా చెట్లను నరికితే భారీ జరిమానా తప్పదని ఆయన తెలియజేశారు. ఒకవేళ ఏదైనా అత్యవసర అవసరం వస్తే తప్పించి, ఇలాంటి పెద్ద చెట్లను తొలగించడానికి ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన తెలియజేశారు.