రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రాష్ట్రాలపై వరుణుడు తన ప్రకోపాన్ని చూపిస్తున్నాడు. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు కురస్తుండటంతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. ఎక్కడికక్కడ వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు సామాన్య ప్రజలు జంకుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో వర్షాప్రభావం మరింత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విజయవాడలో ఏకంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
గత 24 గంటల్లో ఏకంగా 29సెంమీ వర్షపాతం నమోదైనట్లు సమాచారం. దీంతో విజయవాడలోని అనేక కాలనీల్లో 4 అడుగుల మీర నీరు నిలిచిపోయింది.బస్టాండ్ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. పలు బస్సులు నీటిలో మునిగిపోగా క్రేన్ల సాయంతో వాటిని బయటకు తీసినట్లు సమాచారం. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై వరదనీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.