ట్రినిడాడ్‌లోని టరౌబాలో ఉన్న బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరిగిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 తొలి మ్యాచ్‌లో ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టు బోణీ కొట్టింది. గయానా అమెజాన్ వారియర్స్‌పై నైట్ రైడర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా ఇరు జట్ల ఓవర్లనూ కుదిరించారు. దీంతో మ్యాచ్ 17 ఓవర్లకే కొనసాగింది. ఈ క్రమంలో ముందుగా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. వారియర్స్ జట్టు బ్యాటింగ్ చేసింది.
నిర్ణీత 17 ఓవర్లలో వారియర్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఆ జట్టులో షిమ్రాన్ హిట్‌మైర్ (44 బంతుల్లో 63 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రాస్ టేలర్ (21 బంతుల్లో 33 పరుగులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు)లు రాణించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్‌కు 2 వికెట్లు దక్కగా, అలీ ఖాన్, జేఎన్‌టీ సీల్స్, బ్రేవోలు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నైట్ రైడర్స్ జట్టు 16.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి లక్ష్యాన్ని సాధించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో సునీల్ నరైన్ (28 బంతుల్లో 50 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డారెన్ బ్రేవో (27 బంతుల్లో 30 పరుగులు, 2 సిక్సర్లు)లు రాణించారు. వారియర్ బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్, నవీన్ ఉల్ హక్‌లకు చెరో 2 వికెట్లు దక్కగా, షెఫర్డ్, కేఎంఏ పాల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.