రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ పార్టీ సమర్థించదు అని కరీంనగర్ టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం సరైంది కాదన్నారు. ఈ దేశాన్ని రాజ్యాంగమే కాపాడుతుందన్నారు. మతంపై రాజకీయాన్ని తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందకు వంద శాతం విజయం సాధిస్తుందని వినోద్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు.. గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తనకు పెద్ద గుణపాఠమని కరీంనగర్ టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.
అతి ధీమాతో ప్రచారం చేయకపోవడం వల్లే తాను ఓడిపోయానని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గెలుపోటములు తనకు సమానమే అని… ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పుట్టినప్పుడు తాము ఎంపీలు, మంత్రులు అవుతామని అనుకోలేదన్న వినోద్… కేసీఆర్ కూడా సీఎం అవుతారని అనుకోలేదని తెలిపారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉందని… అయితే అందరికీ టికెట్లు ఇవ్వలేమని వినోద్ కుమార్ అన్నారు.