కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు భారత్ బంద్ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు వరకు బంద్ ఉంటుందని రైతు సంఘాలు తెలిపాయి. సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. తమ విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నిరభ్యంతరంగా వెళ్ల వచ్చనీ 3 గంటలకు బంద్‌ను ముగిస్తామని రైతుసంఘాల ప్రతినిథులు తెలిపారు. ఇక తెలంగాణాలోని అధికార టీఆర్ఎస్ భారత్ బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన తెలిపి రైతుల పోరాటానికి అండగా నిలవాలని సూచించారు మంత్రి కేటీఆర్. కూకట్‌పల్లి ఉషాముళ్ళపూడి వద్ద రహదారి పై బైఠాయించిన ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ రైతు వ్యతిరేక బిల్లును రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రభుత్వ విప్ గాంధీ, కార్యకర్తలు పడుకున్నారు. దీంతో కూకట్ పల్లి నుండి మూసాపేట, మరో పక్క మియాపూర్ దాకా ట్రాఫిక్ నిలిచిపోయింది.