ఆవిర్భావ దినోత్సవం ఇలా చేయండి.. శ్రేణులకు ఎంపీ సంతోష్ పిలుపు

-

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితికి ఈ నెల 27 తో 20 ఏళ్లు నిండనున్నాయి. 2001 ఏప్రిల్ 27న కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్ష వైపు కేసీఆర్ తొలి అడుగు ముందకేసి టీఆర్ఎస్‌ను స్థాపించారు. 13 ఏళ్లు పోరాడి.. ఉద్యమంలో అన్ని తానై, ప్రాణాలు సైతం పణంగా పెట్టి తెలంగాణ ప్రజల కళను సాకారం చేశారు. ఆ తర్వాత ప్రజలు అందించిన విజయంతో పాలన పగ్గాలు చేపట్టిన కేసీఆర్.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు.

అలాంటి టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండగ వాతావరణంలో నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అవిర్భావ పండగను నిరాడంబరంగా జరుపుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఎలాంటి హంగులు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్టానం శ్రేణులకు సూచిస్తుంది. ఈ మేరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పార్టీ శ్రేణులకు వినూత్న పిలుపునిచ్చారు. 20 సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సహచరులందరికి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

కరోనా వైరస్ నేపథ్యంలో నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను జరుపుకుంటూ, సామాజిక హితానికి పాల్పడాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తప్పకుండా మాస్కులు ధరించడంతో పాటు ప్రజలకు పంపిణీ చేయాలని.. అలాగే సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాలని సూచించారు. టీఆర్ఎస్ 20వ వార్షికోత్సవాన్ని సూచించేలా కేసీఆర్ చిత్ర పటంతో తయారు చేసిన మాస్క్‌ను ధరించిన ఫోటోలను ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ట్వీటర్ వేదికగా విడుదల చేశారు. ఇదే రకమైన మాస్క్ లను తయారుచేసి, పంపిణీ చేయాలని.. మాస్క్‌లు ధరించిన ఫోటోలను తనకు షేర్ చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version