ప్రపంచం మొత్తమే కరోనా వల్ల తీవ్ర సంక్షోభానికి గురి అవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి తమ దేశానికి తాత్కాలికంగా వలసలను నిలిపివేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంచించిన ఉత్తర్వులపై సంతకం చేస్తానాని ట్రంప్ వెల్లడించారు.దేశంలో ఇప్పటికే 2.2 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అమెరికా ప్రజల శ్రేయస్సు కోసం, ఉద్యోగ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ వెల్లడించారు.
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాకు వెళ్లాలనుకున్న చాలా దేశాల ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ప్రధానంగా చైనా, ఇండియా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొననున్నారు. ఇప్పటికే విదేశాల్లో విద్యను అభ్యసించడానికి సిద్ధపడ్డ విద్యార్థులు, అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల తాత్కాలికంగా లేదా ట్రంప్ మళ్ళీ ఈ ఇమ్మిగ్రేషన్ విధానాలను మార్చే వరకు తమ ప్రణాళికనను వాయిదా వేసుకోక తప్పదు.