అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. ఆయన నిర్ణయం తీసుకున్నా సరే ఆయన వారి సలహా లేకుండా ఒక్క అడుగు కూడా వేయరు. సంచలన నిర్ణయాలు తీసుకునే సమయంలో వారితో సంప్రదించిన తర్వాతే ట్రంప్ ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు. వాణిజ్య ఒప్పందాలు అయినా, మరొక ఒప్పందం అయినా సరే వారి సలహా లేకుండా ఏదీ జరగదు.
ఆ ఇద్దరే కుమార్తె ఇవాంకా ట్రంప్, అల్లుడు జారెద్ కుష్ణర్. ట్రంప్ మొదటి భార్య కుమార్తె అయినా ఇవాంకా అంటే ఆయనకు చాలా ఇష్టం. వ్యాపారంలో అయినా ఎన్నికల ప్రచారంలో అయినా సరే ఆమె సలహాలు కచ్చితంగా తీసుకునే వారు ట్రంప్. తాను ఆర్ధికంగా బలవంతుడ్ని అవ్వడానికి కుమార్తె సలహాలే కీలకం అని భావిస్తారు ఆయన. విద్యార్ధి దశ నుంచే ఇవాంకా ఆయనకు బలంగా మారింది అని చెప్తారు.
ఇక ఆయనకు అసలు ఎన్నికల బరిలో నిలవాలి అని చెప్పింది కూడా ఇవాంకానే అంటారు వారి సన్నిహితులు. ఇక ఎన్నికల ప్రచారలో నిధులు ట్రంప్ బయటి నుంచి తీసుకుందాం అని చూసినా ఆమె మాత్రం సొంత నిధులే వినియోగించాలి అని సలహా ఇచ్చింది. ఇక అధ్యక్షుడు అయిన వెంటనే ఆమెను తన సలహాదారుగా నియమించుకున్నారు ట్రంప్. అలాగే అల్లుడు జారెద్ కుష్ణర్ ని కూడా సలహాదారుగా నియమించుకున్నారు.
ఉగ్రవాదంపై పోరు సహా మధ్యప్రాచ్యంలో ఏ విధంగా వ్యవహరించాలి…? గల్ఫ్ దేశాల విషయంలో తీసుకునే సలహాలు…? ఆఫ్రికాలో అమెరికా వాణిజ్య ఒప్పందాలు… అగ్ర రాజ్యాలతో తీసుకునే జాగ్రత్తలు వంటి వాటిని వారి సలహాతోనే ట్రంప్ ముందుకి వెళ్తారు. విదేశీ పర్యటనల సమయంలో ట్రంప్ వారు లేకుండా అసలు ముందుకి అడుగు వేసే పరిస్థితి ఉండదు. ప్రస్తుత భారత పర్యటనలో కూడా వాళ్ళే ఉన్నారు.