తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించినా కూడా కరోనా అంతగా తగ్గుముఖం పట్టడం లేదని, సరియైన ఫలితాలు లేవని రిపోర్టులు అందుతున్నాయని, ఈ నేపథ్యంలో లాక్డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయని సీఎంఓ తెలిపింది.కొన్ని వర్గాలు లాక్డౌన్ కావాలని కోరుకుంటున్న పరిస్థితి ఉందని ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ విధించడం వల్ల కలిగే సాదకబాదకాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ళ ప్రక్రియ మీద లాక్ డౌన్ ప్రభావం ఏమేరకు ఉంటుందనే అంశంపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అలానే ఈటల మంత్రి పదవి బర్తరఫ్ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 4,826 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 4,36,619కి చేరగా… ప్రస్తుతం 62,797 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్న విషయం తెల్సిందే. అయితే లాక్డౌన్ విధించని నేపథ్యంలో కరోనా కట్టడికి మరిన్ని ఆంక్షల విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.