టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో లక్షలాది అభ్యర్థుల జీవితం గందరగోళంలో పడింది. ఈ క్రమంలో లీకేజీతో రద్దయిన, వాయిదా పడిన అయిదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలను కమిషన్ రద్దు చేయగా, రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్ అకౌంట్స్ అధికారి(డీఏవో), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పరీక్షలు రద్దు కాగా.. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్(టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్ ఇప్పటికే ఖరారు చేసింది. ఈ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి మంగళ లేదా బుధవారాల్లో కొత్త తేదీలు వెల్లడించే అవకాశాలున్నాయి. వీటిలో కొన్ని పోస్టుల రాతపరీక్షలను గతంలో ఓఎంఆర్ పద్ధతిలో కమిషన్ నిర్వహించింది. తాజాగా వీటికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏయే పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కొత్త తేదీలతో పాటు ఈ అంశాలను కూడా ప్రకటించే అవకాశాలున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.