టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. లీకేజీ దందా కమిషన్ కార్యాలయం కేంద్రంగానే కొనసాగినట్టు సిట్ అధికారులు అంచనాకు వచ్చారు. ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో షమీమ్, రమేష్ కుమార్, సురేష్ పేర్లు బయటకు వచ్చాయి. ఈ నెల 22న సిట్ పోలీసు బృందాలు ఈ ముగ్గురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు.
వీరి ఇళ్ల నుంచి ల్యాప్‌టాప్, 4 చరవాణులు స్వాధీనం చేసుకోగా.. ఏ12 రమేష్ కుమార్ ఇంట్లో లభించిన ల్యాప్‌టాప్ నుంచి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ప్రవీణ్ కుమార్ ద్వారా రమేష్, రాజశేఖర్ రెడ్డి నుంచి షమీమ్, సురేష్‌కు గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నాపత్రాలు వాట్సాప్ ద్వారా చేరినట్టు వారి వద్ద లభించిన మొబైల్ ఫోన్ల ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఒకరికొకరు వాటిని చేరవేసుకుంటూ పరీక్షకు సిద్ధమయ్యారు.
కమిషన్‌లో జూనియర్ అసిస్టెంట్ అనురాజ్, పొరుగు సేవల నుంచి డెవలపర్ హరీశ్‌కుమార్ నుంచి ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి.. కాన్ఫిడెన్షియల్ విభాగం నుంచి ప్రశ్నాపత్రాలు కొట్టేసేందుకు వేసిన ఎత్తుగడలు.., సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఇంకా ఈ పేపర్లు ఎవరెవరి చేతులో మారాయోనని సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.