ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. ఈ నెల 9న మిలియన్ మార్చ్‌కు పిలుపు..

-

ఆర్టీసీ స‌మ్మె నేటితో 33వ రోజుకు చేరుకుంది. విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ రెండోసారి ఇచ్చిన డెడ్‌ లైన్‌ ను కార్మికులు భేఖాతరు చేశారు. ఆర్టీసీలో మొత్తం 49,733 మంది మొత్తం మంది కార్మికులుండగా సుమారు 400 మంది విధులకు హాజరయ్యారు. ముందు నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నట్లుగానే కార్మికులు విధుల్లో చేరలేదు. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, డిమాండ్ల పరిష్కారానికి సమ్మెను ఉధృతం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈ నెల 9వ తేదీన‌ మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు.

ఈ మేరకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మిలియన్ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. అన్ని ఉద్యోగ సంఘాలు మిలియన్ మార్చ్‌కు మద్దతు తెలుపుతాయని భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ నిర్ణయాలకు ఎవ్వరూ భయపడవద్దని, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కొందరు ఆర్టీసీ ప్రతినిధులు కలిసేందుకు వెళ్లారని అశ్వత్థామరెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news