తిరుమల సాలకోట్ల బ్రహ్మోత్సవాలు 5వ రోజుకు చేరాయి.బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మలయప్ప స్వామి వారు భక్తులకు మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. మోహినీ అవతారంలో ఉన్న శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.ఆ మనోహర రూపాన్ని చూసి భక్తులు మంత్ర ముగ్ధలయ్యారు.తిరుమల ఏడు కొండలు శ్రీనివాస నామస్మరణతో మారుమోగాయి.
తిరుమాఢ వీధుల్లో స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిస్తుండగా.. మంగళవాయిద్యాలతో పాటు భక్తులు పారవశ్యంతో ముందుకు సాగారు. దీంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. అడుగడుగునా ఆయనకు భక్తులు కర్పూర హారతులు పట్టారు. క్షీరసాగర మథనం చేసేటపుడు అసురులను మాయచేసి, దేవతలకు అమృతం పంచేందుకు స్వామివారు మోహినిగా ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాయాలోకం నుంచి భక్తుల్ని బయటపడేయడమే మోహినీ రూపం వెనుక ఉన్న పరమార్థం అని పురోహితులు చెబుతున్నారు. కాగా, నేడు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ స్వామివారికి గరుడవాహన సేవ కొనసాగనుంది.