కరోనా నియంత్రణకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుమలకు వచ్చే భక్తులందరి నమూనాలను సేకరించడంతో పాటు బస్సుల్లో కొండమీదకు వచ్చే ప్రయాణికులకు టికెట్‌తో పాటు ఓ చీటిని సైతం అందిస్తోంది. అందులో తిరుమలకు వచ్చే చిరునామా, మొబైల్ నంబర్, బస్సు నంబరు, సమయం రాయాల్సి ఉంటుంది. అలా భక్తులు రాసిన చీటీలను అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఆర్టీసీ సిబ్బంది సేకరిస్తారు.
దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టడం సులువవుతుంది. ఒకవేళ బస్సులో ప్రయాణించిన ఎవరికైనా వైరస్ సోకిందని తేలితే..అతనితో ప్రయాణించిన వారిని సులువుగా గుర్తించేందుకు ఈ ఏర్పాటును చేశామని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ అమలు సమయంలో పాజిటివ్ కేసులు నియంత్రణలోనే ఉన్నాయి. కానీ లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదువుతున్నాయి. ఈ నేపధ్యంలోనే టీటీడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.