కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తేశారు. ఎగువ నుంచి భారీగా వరద పరవళ్లు తొక్కుతుండటంతో ముందస్తుగా సోమవారం సాయంత్రం 3 గేట్లు ఎత్తి వరద నీటిని తుంగభద్ర నదిలోకి రిలీజ్ చేస్తున్నారు.
తుంగభద్ర డ్యాంకు ఇన్ ఫ్లో 1,01,993 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 7,744 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం డ్యాంలో 87.056 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1628.09 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు టీబీ డ్యాం అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1628.09 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.భారీ వరద నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు దిగువన ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.