భారీ భూకంపంతో టర్కీ, సిరియాలు వణికిపోతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఆ దేశాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పటికీ ఎన్నో వేల మంది శిథిలాల కిందే మగ్గిపోతున్నాయి. అయితే ఈ విపత్తు సంభవిస్తుందని ఓ నిపుణుడు మూడు రోజుల ముందే హెచ్చరించారట.
భూకంపాల తీవ్రతను అధ్యయనం చేసే సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వే(SSGEOS) సంస్థకు చెందిన పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్‌బీట్స్.. తాజా విపత్తును ముందే అంచనా వేశారు. ‘త్వరలోనే దక్షిణ మధ్య టర్కీ, జొర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని ఫిబ్రవరి 3నే ఓ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన అంచనాలు నిజమయ్యాయి. ఫిబ్రవరి 6న తెల్లవారుజామున మొదలైన భూకంప ప్రకంపనలు విలయాన్ని సృష్టించాయి.
తాజాగా దీనిపై స్పందించిన ఫ్రాంక్ హూగర్‌బీట్స్.. ఈ సంఘటన తనను ఎంతో కలచివేసిందన్నారు. త్వరలోనే భూకంపం వస్తున్నట్లు ముందుగానే చెప్పానని.. అది 115 ఏళ్ల క్రితం వచ్చిన మాదిరిగానే ఉంటుందని అన్నారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా వీటిని ముందుగానే అంచనా వేశామన్నారు. స్థానికంగా ఇప్పటివరకు సంభవించిన దాంట్లో ఇదే అత్యంత తీవ్రమైనదని.. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు.