మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా తన భర్త ఏమీ ఆత్మహత్యకు పాల్పడలేదని తమిళ బుల్లితెర నటి రేఖ స్పష్టం చేసింది. ఈ నెల 25న గోపీనాథ్ అనే వ్యక్తి పెరంబూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను బుల్లితెర నటి, వ్యాఖ్యాత రేఖ భర్త అని, తన కార్యాలయంలో పని చేసే వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ వ్వవహారం కారణంగా గోపీనాథ్ రేఖ మధ్య తరుచూ గొడవలు జరిగేవని ప్రచారం జరిగింది. అక్రమ సంబంధం, అప్పుల బాధ కారణంగా గోపీనాథ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చర్చ జరిగింది.
అయితే ఈ ప్రచారంపై తాజాగా స్పందించిన రేఖ, ఆత్మహత్య చేసుకున్నది తన భర్త కాదని స్పష్టం చేసింది. సూసైడ్ చేసుకున్న వ్యక్తి భార్య పేరు జెనీఫర్ రేఖని, ఆమె పేరులో కూడా రేఖ ఉండటం, తన భర్త పేరు గోపీనాథ్ కావడంతోనే ఈ ప్రచారం జరిగిందని తెలిపింది. తన భర్తతో ఎటువంటి గొడవలూ లేవని, ఇద్దరమూ సఖ్యంగా ఉన్నామని, ఈ ప్రచారానికి ఇక స్వస్తి పలకాలని కోరింది.