మహిళలపై జరుగుతున్న అత్యాచాలు, లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలను తీసుకువస్తున్నాయి. నిందితులకు కఠినంగా శిక్షలు కూడా అమలుచేస్తున్నారు. అయినప్పటికీ అవేవీ కొందరు ప్రబుద్ధులకు భయం కలిగించడం లేదు. దీంతో వారు మహిళలపై అత్యాచారాలను కొనసాగిస్తున్నారు. తాజాగా యూపీలో ఓ రన్నింగ్ బస్సులో మహిళపై డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఇప్పుడీ విషయం కలకలం సృష్టిస్తోంది.
యూపీలోని ప్రతాప్‌గఢ్ నుంచి నోయిడా వెళ్దామని ఓ మహిళ బస్సు ఎక్కింది. ఆమెకు బస్సులోని ఇద్దరు డ్రైవర్లు చివరి సీట్లలో కూర్చోమని చెప్పారు. ఈ క్రమంలో వారు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ మహిళ వయస్సు 25 ఏళ్లు కాగా ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి నోయిడా వెళ్తోంది. అయితే ఆమె నోయిడాలో బస్సు దిగగానే తన భర్తకు ఈ విషయాన్ని చెప్పి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు రంగంలోకి దిగి ఇద్దరు డ్రైవర్లలో ఒకరిని పట్టుకుని అరెస్టు చేశారు. మరొక డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
కాగా ఆ మహిళపై వారు లక్పో, మధుర మధ్య అత్యాచారం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు వారు నిందితులపై 376, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.