రైల్వే లెవల్ క్రాసింగ్‌ల వద్ద చాలా జాగ్రత్తగా వాహనాలను నడిపించాల్సి ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరుగుతాయి. దీంతో క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే లెవల్ క్రాసింగ్ ల వద్ద జాగ్రత్తగా ఉండాలని రైల్వే ఎంత విజ్ఞప్తి చేస్తున్నా కొందరు మాత్రం వినడం లేదు. దీంతో లెవల్ క్రాసింగ్ ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. తాజాగా ఓ లెవల్ క్రాసింగ్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కానీ అదృష్టవశాత్తూ అందులో ఎవరికీ ఏమీ కాలేదు.
ఏపీలోని ఓ లెవల్ క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి టూవీలర్‌పై నిర్లక్ష్యంగా దాటుతున్నాడు. అయితే రైలు వచ్చేందుకు కొన్ని క్షణాల ముందు తన వాహనం అదుపు తప్పింది. దీంతో అతను కింద పడ్డాడు. కానీ రైలు వస్తుందని తెలుసుకుని వెంటనే వెనక్కి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన రాజధాని ఎక్స్‌ప్రెస్ అతని బైక్‌ను వేగంగా ఢీకొడుతూ వెళ్లింది. దీంతో ఆ బైక్ తుక్కు తుక్కు అయింది.
Smithereens…bike and train!😊😊😊 pic.twitter.com/3IGwtGHDLI
— Rajendra B. Aklekar (@rajtoday) January 27, 2021
కాగా రైలు వచ్చే ముందు ఆ వ్యక్తి పక్కకు తప్పుకున్నాడు కనుక ప్రమాదం జరగలేదు. అతని వాహనం మాత్రం ధ్వంసమైంది. ఇక ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ క్రమంలో ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియో వైరల్ అవుతోంది. అయితే లెవల్ క్రాసింగ్ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ వ్యక్తిని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇది ఇంకొకరికి గుణపాఠం కావాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో లెక్కల ప్రకారం మన దేశంలో రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2018లో దేశవ్యాప్తంగా 1408 ప్రమాదాలు చోటు చేసుకోగా 2019లో ఆ సంఖ్య పెరిగి 1788కు చేరుకుంది. అయినప్పటికీ కొందరు ఇంకా లెవల్ క్రాసింగ్ ల వద్ద ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలను కోల్పోతున్నారు.