తోడెవ‌రు లేరు… అక్కా చెల్లెళ్ల బ‌తుకుపోరాటానికి సాయం చేస్తారా…

-

చుట్టూ ఉన్న‌ది జ‌నార‌ణ్య‌మే..కాని నా అన్న‌వాళ్లు..సాయం చేద్దామ‌ని ముందుకు వ‌చ్చిన‌వారూ లేరు..త‌ల్లిదండ్రులు అనారోగ్యంతో కాన‌రాని లోకాల‌కు వెళ్లిపోయారు. త‌మ‌ను ఉన్న‌త‌మైన స్థితుల్లో చూడాల‌నుకున్న‌ త‌ల్లిదండ్రుల క‌ల నెర‌వేర్చాల‌న్న ప‌ట్టుద‌లతో ఆ ఇద్ద‌రు అక్కాచెల్లెళ్లు క‌ష్టాలకు ఎదురుదీతున్నారు. అయితే ఆ ఇద్ద‌రి గుండెల్లో కొన్నాళ్లుగా భ‌యం గూడు క‌ట్టుకుంది. ఉన్న పూరిగుడిసె కాస్త కూలిపోతుండ‌టంతో ఎండ‌కు ఎండుతూ..వాన‌కు త‌డుస్తూ..చ‌లికి వ‌ణుకుతూ బ‌తుకుతున్నారు.

జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బిరుదుల లక్ష్మణ్, బాలవ్వకు ఇద్దరు కుమార్తెలు రజిత, జ్యోతి. వీరు చదువుకుంటున్న సమయంలోనే తండ్రి లక్ష్మణ్‌ 2009లో అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి బాలవ్వ పంచాయతీలో పారిశుధ్య కార్మికురాలుగా పని చేస్తూ ఇద్దరు కూతుర్లను చదివించింది. మూడేళ్ల కిందట తల్లిని క్యాన్సర్‌ మహమ్మారి కబలించింది. దీంతో ఇద్దరు యువతులు అనాథలుగా మిగిలారు. తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన పూరి గుడిసెలోనే ఉంటున్నారు.

రజిత ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేసుకుంటూ చెల్లెలు జ్యోతిని డిగ్రీ చదివిస్తోంది. సెల‌వు దొరికిన‌ప్పుడ‌ల్లా జ్యోతి అక్క‌కు చేదోడు వాదోడుగా ఏదో ఓ ప‌ని చేస్తోంది. అయితే ఇప్పుడు వీరు ఉంటున్న పూరిగుడిసె శిథిలావ‌స్థ‌కు చేరింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియ‌ని ప‌రిస్థితి. త‌ప్ప‌నిస‌రి పరిస్థితిలో ఇద్ద‌రు అక్కాచెళ్లెల్లు ఆ గుడిసెలోనే భ‌యంభ‌యంగా ఉంటున్నారు. వ‌ర్షం ప‌డితే ఇళ్లంతా బుర‌ద‌మ‌యంగా మారుతోంది. గుడిసె ప్లాస్టిక్ క‌వ‌ర్ క‌ప్పుతున్నా వ‌ర‌ద ఆగ‌డం లేదు. దీంతో వ‌ర్షం కురిస‌న రాత్రి నిద్ర‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు.

త‌ల్లిదండ్రులు లేకున్నా త‌మ కాళ్ల మీద ఆత్మ‌గౌర‌వంత బ‌త‌కాల‌ని, త‌ల్లిదండ్రుల క‌ల నెర‌వేర్చాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెబుతున్న ఈ అక్కా చెల్లెళ్లు ఎవ‌రైనా ద‌యార్ధ హృద‌యులు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముందుకు రావాల‌ని కోరుతున్నారు. ప్రభుత్వమైనా స్పందించి తమకు గూడు, స్వయం ఉపాధి కోసం దారి చూపాలని వేడుకుంటున్నారు. బాధితులకు ఆర్థికసాయం చేసేవారు బిరుదుల రజిత అకౌంట్‌నం. 62483346935, ఎస్‌బీఐ, జగిత్యాల. ఐఎఫ్‌ఎస్‌సీ నం. ఎస్‌బీహెచ్‌వై0021978.

Read more RELATED
Recommended to you

Latest news