పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన విపక్షాలు.. ఇంకా వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మోడీ-అమిత్‌షా ద్వయం వేస్తున్న వ్యూహాల్లో చిక్కుకుని విలవిలాడుతూనే ఉన్నాయి. పలువురు కీలక నేతలు వరుసబెట్టి కమలం గూటికి చేరుతున్నారు. ఇక తాజా విషయానికి వస్తే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్శ మరింత ఊపందుకున్నట్లుంది. విపక్షాలకు కమలదళం ట్రైలర్ చూపించింది. ఎస్సీపీ ఎంపీ, ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్ ఎంపీ ఉదయన్‌రాజ్ భోంస్లేను లాగేసింది. ఇటీవల ఎస్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన భోంస్లే.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం బీజేపీపలో చేరారు.
మహారాష్ట్రలో అత్యంత సంపన్న ఎంపీగా గుర్తింపు పొందిన ఆయన బీజేపీలోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇటీవలే మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే భోంస్లే రూపంలో ఎన్సీపీకి గట్టి షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి ఊర్మిళ కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
అయితే.. బీజేపీలో చేరిన తర్వాత భోంస్లే మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ, అమిత్ షా నాయకత్వంలో దేశం అభివృద్ధి పథకంలో దూసుకుపోతోందని అన్నారు. ఫడ్నవిస్‌తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామినైతానని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరి కంటే సంపన్నుడిగా ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే నిలిచారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున సతారా నుంచి మళ్లీ పోటీ చేసిన ఆయన.. తనకు రూ.199 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.185.5 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.13.38కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
కుటుంబ సభ్యుల పేరిట రూ.89 లక్షల డిపాజిట్, రూ.1.45 కోట్ల మేర షేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే.. భోంస్లే నిర్ణయంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు షాక్‌కు గురయ్యాయి. సీనియర్ నేతలు పార్టీని వీడుతుండడం.. కిందిస్థాయి పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తాయని, అది ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలకు దారితీస్తుందని ఎన్సీపీ, కాంగ్రెస్ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోంస్లే దారిలో ఇంకా ఎవరెవరున్నారో తెలియక నేతలు తలలుపట్టుకుంటున్నారు.