వారి బాధను చూసి.. కన్నీరు పెట్టుకున్న ప్రియాంక చోప్రా..

-

ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దురాక్రమణ ఎన్నో విషాదాలను ప్రపంచం ముందు ఉంచింది. దాడుల బారినుంచి తప్పించుకునేందుకు మహిళలు, చిన్నారులు ప్రాణాలు అరచేతపట్టుకొని దేశం దాటారు. మరికొందరు సొంత దేశంలోనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పురుషులు యుద్ధభూమిలోనే పోరాడుతుండగా.. మిగిలిన కుటుంబ సభ్యులు సరిహద్దు దేశాల్లో శరణార్థులుగా మిగిలి, అయినవారిని కలుసుకోలేక కాలం వెళ్లదీస్తున్నారు.

అలా పొలండ్‌లోని శరణార్థి శిబిరంలోని వారిని మనదేశానికి చెందిన ప్రముఖ నటి, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ ప్రియాంక చోప్రా పరామర్శించారు. వారి కష్టాలు విని కన్నీరు పెట్టుకున్నారు.

తన పర్యటన సందర్భంగా ప్రియాంక.. శరణార్థ మహిళలతో మాట్లాడారు. చిన్నారులలో కలిసి సరదాగా గడిపారు. కొందరు చిన్నారులు తాము చేతితో చేసిన బొమ్మలను ఆమెకు ఇచ్చి ఆశ్చర్యపర్చారు. ఈ క్రమంలో దాదాపు ఆరునెలల కాలంగా శరణార్థులుగా వారు అనుభవిస్తోన్న ఆవేదన విని, ఉద్వేగానికి గురయ్యారు. స్వదేశంలోనే ఉండిపోయిన అయినవారిని కలుసుకోలేకపోతున్నామని వారు బాధపడుతుంటే.. ఆమె కన్నీరు ఆపుకోలేకపోయారు.

‘యుద్ధం కారణంగా కలిగిన గాయాలు కొన్ని మనకు వార్తల్లో కనిపించవు. కానీ యునిసెఫ్ మిషన్‌లో భాగంగా వార్సా(పొలండ్ రాజధాని) వెళ్లిన నాకు అవి స్పష్టంగా కనిపించాయి. మూడింట రెండొంతుల మంది చిన్నారులు తమ సొంత ప్రాంతాలను వీడారు.

యుద్ధ భయంతో ఉక్రెయిన్ సరిహద్దులు వీడిన వారిలో 90 శాతం మంది మహిళలు, చిన్నారులే. వారికి ఆసరాగా నిల్చేందుకు పలు శిబిరాలు ఏర్పాటయ్యాయి’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ క్లిష్ట సమయంలో అత్యవసర సేవల నిమిత్తం యునిసెఫ్ పొలండ్‌లో 11 బ్లూ డాట్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news