రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యన్ ఆర్మీకి భారీ షాకులు ఇస్తోంది ఉక్రెయిన్. ఇప్పటికే 6000 పైగా రష్యన్ సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఇదిలా ఉంటే .. తాజాగా రష్యా మేజర్ జనరల్ ని హతమార్చి భారీ షాక్ ఇచ్చింది ఉక్రెయిన్. రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ, సుఖోవిట్ స్కీని హతమార్చినట్లు బెలారస్ మీడియా ప్రకటించింది. నెస్టా మీడియా కూడా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. అయితే ఇది రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్ని రష్యా మాత్రం ఇంతవరకు ధ్రువీకరించలేదు. తాజాగా ఓ మేజర్ జనరల్ స్థాయి అధికారి చనిపోవడంతో రష్యా ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి.
ఇదిలా ఉంటే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. కీవ్, ఖార్కీవ్ పట్టణాలపై భారీ ఎత్తున రష్యా దాడులు చేస్తోంది. రష్యా కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారీగా ఫైరింగ్ చేస్తోంది. జనావాసాలతో పాటు ప్రభుత్వ భవనాలను కూడా నామ రూపాలు లేకుండా చేస్తోంది. ఇదిలా ఉంటే ఎనిమిది రోజులైన రష్యాకు తగ్గదేలేదు అన్న రీతిలో ఉక్రెయిన్ సేనలు కూడా భీకరదాడి చేస్తూ .. రష్యా సేనల్ని నిలువరిస్తున్నాయి.