రష్యా వీటో పవర్ తొలగించండి.. ఐరాసకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

ఉక్రెయిన్ పై మరో వార్ కి రెడీ అవుతున్నట్లు పుతిన్ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రష్యాలో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్లు పుతిన్‌ ప్రకటించడాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తప్పుపట్టారు. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో వీడియో మాధ్యమంలో ఆయన ప్రసంగించారు. రష్యా శిక్షను అనుభవించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఈ యుద్ధంలో మాస్కో చేసిన నేరాలను విచారించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఐరాసను జలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందజేయడం, ప్రపంచ వేదికపై రష్యాను శిక్షించడం వంటి అంశాలతో కూడిన ఓ శాంతి ప్రతిపాదనను ఆయన వెల్లడించారు. శాంతికి రష్యా ఏమాత్రం సిద్ధంగా లేదన్న అంశాన్ని తాజా పరిణామాలు సూచిస్తున్నాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో రష్యాకు వీటో అధికారాన్ని తొలగించాలని ప్రపంచ దేశాలను ఆయన కోరారు. రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఐకమత్యం ప్రదర్శించాలని కోరారు.