భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియను కొందరు స్వాగతిస్తూ ఉండగా మరికొందరు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే సొంత దేశంలో నే తలనొప్పిగా మారగా, ఇప్పుడు అంతర్జాతీయ తెరపైకి కూడా ఈ CAA ప్రస్తావన వచ్చింది. ఈ చట్టం మానవ హక్కులకు విరుద్ధమంటూ ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల కమిషన్ మన దేశ సుప్రీం కోర్టులో ఏకంగా పిటీషన్ కూడా దాఖలు చేయడం విశేషం. దీనిపై కోర్టు జోక్యం చేసుకోవాలని ఇంటర్వెన్షన్ దావా దాఖలు చేసింది. జెనీవాలో భారత శాశ్వత కార్యాలయానికి ఈ విషయం తెలిపింది. అయితే మరోపక్క ఐరాస పిటిషన్‌పై మోదీ ప్రభుత్వం ఘాటుగానే స్పందించింది. CAA అనేది తమ అంతర్గత విషయమని ఈ వ్యవహారాల్లో ఐరాస తలదూర్చడం తగదని మండిపడింది. ‘సీఏఏ పూర్తిగా మా అంతర్గత అంశం. వేరే దేశం, లేదా వ్యవస్థలకు ఇందులో జోక్యం చేసుకునే అధికాం లేనే లేదు. సార్వభౌమ దేశమైన భారత్‌కు శాసన నిర్మాణ అధికారం ఉంది. సీఏఏ రాజ్యాంగానికి లోబడే ఉంది.
సుప్రీం కోర్టు కూడా దీన్ని గుర్తిస్తుందని ఆశిస్తున్నాం..అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. CAA రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేదని మరియు మా రాజ్యాంగ విలువల యొక్క అన్ని అవసరాలకు అనుగుణంగా ఉందని మాకు స్పష్టమైంది. భారత విభజన యొక్క విషాదం నుండి ఉత్పన్నమయ్యే మానవ హక్కుల సమస్యలకు సంబంధించి మా దీర్ఘకాల జాతీయ నిబద్ధతకు ఇది ప్రతిబింబిస్తుంది అని మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీ లో CAA కు వ్యతిరేకంగా ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనితో ఈ అంశం ప్రపంచ దేశాలకు కూడా హాట్ టాపిక్ గా మారింది.