నేడు దేశంలో నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర రూపం దాల్చింది. ఈ మధ్యే తమిళనాడులోని చెన్నైలో స్టేట్ అసెంబ్లీ సెక్రటేరియట్ లో శానిటరీ వర్కర్స్ ఉద్యోగాల కోసం ఎంబీఏ, ఇంజినీరింగ్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఆ విషయం అందరినీ విస్మయానికి గురిచేసింది. మొత్తం 14 పోస్టులకు గాను 4వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఇంజినీరింగ్, ఎంబీఏ చదివిన వారే ఎక్కువ ఉన్నారని తెలిసింది. అలాగే గతేడాది ఆగస్టులో యూపీ పోలీసు విభాగంలో టెలికాం వింగ్‌లో 62 ప్యూన్ పోస్టుల కోసం 54,230 మంది గ్రాడ్యుయేట్లు, 28,050 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 3740 మంది పీహెచ్‌డీ హోల్డర్లు దరఖాస్తు చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశారు. నిజానికి ఇవి రెండు మనకు తెలిసిన ప్రత్యక్ష ఉదాహరణలు మాత్రమే. నిరుద్యోగ సమస్య దేశంలో ఏవిధంగా ఉందో ఈ రెండు సంఘటనలు మనకు తెలియజేస్తాయి.
అయితే పైన చెప్పిన సంఘటనలే కాదు.. తాజాగా ఓ యువకుడు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసిన సంఘటన ఒకటి కూడా దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉందో మనకు కళ్లకు కట్టినట్లు తెలియజేస్తుంది. ఇటీవలే కోల్‌కతాకు చెందిన షౌవిక్ దత్తా అనే యువకుడు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అయితే ఆ ఫుడ్ తీసుకుని వచ్చిన వ్యక్తి కామర్స్‌లో పీజీ చేశాడట. అతనితో మాటలు కలిపిన షౌవిక్‌కు ఆ విషయం తెలిసింది. పీజీ చేసి జొమాటోలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా అతను పనిచేస్తున్నాడని షౌవిక్‌కు తెలియడంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. దేశంలో నిరుద్యోగ సమస్య ఇలా ఉంటే.. నేతలు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఎటు పోతున్నాయి.. అంటూ షౌవిక్ తన ఫేస్‌బుక్ ఖాతాలో తాను ఎదుర్కొన్న సంఘటన గురించి పోస్టు పెట్టాడు.
Probably the only time i regret ordering food from ZomatoIt was one of those usual checkouts ordering food,when i was…
Posted by Shouvik Dutta on Wednesday, February 6, 2019
అలా షౌవిక్ పెట్టిన పోస్టు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో విద్యారంగ నిపుణులు కూడా ఈ విషయంపై స్పందించారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆ సమస్య పెరిగిందని కూడా వారు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్‌వో) నుంచి లీకైన సమాచారం మేరకు.. ప్రస్తుతం చాలా వరకు చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఏకంగా పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేస్తున్నారట. ప్రభుత్వాలు విద్యార్థుల చదువుకు తగ్గ ఉద్యోగాలను ఇవ్వకపోయినా, కనీసం ప్రైవేటు రంగంలో అయినా వారి చదువుకు తగ్గ ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమవుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో వ్యవస్థలు కొనసాగితే మాత్రం ముందు ముందు విద్యార్థులకు అసలు ఆ చిన్నపాటి ఉద్యోగాలు కూడా దొరకవేమోనని విద్యా రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా.. నిరుద్యోగ యువత మాత్రం నాయకులకు బుద్ధి వచ్చేలా ఏకతాటిపై నిలబడి పోరాటం చేస్తే తప్ప.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు..!