బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ జాతిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ సోమవారం స్పష్టం చేసారు. యుకెలో కొత్త కరోనా వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదని ఆయన దేశ ప్రజలకు సూచించారు. వర్చువల్ విలేకరుల సమావేశంలో హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. గత సంవత్సరంలో, మీరందరూ చూసినట్లుగా, ప్రజల భద్రత నిమిత్తం అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాము.” అని చెప్పారు.
ఆ వైరస్ ని ఎదుర్కోవడానికి మన వద్ద అన్ని వనరులు ఉన్నాయని, అసలు భయపడాల్సిన అవసరమే లేదని అన్నారు. ఇక ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త పర్యవేక్షణ బృందం సోమవారం సమావేశమై కరోనా వైరస్ కొత్త రూపం గురించి చర్చించింది. దక్షిణ ఇంగ్లాండ్ అంతటా కొత్త కొరోనావైరస్ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నంలో ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. యుకెకి పలు దేశాలు విమానాలను నిషేధించాయి.
ఇప్పటివరకు, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా మరియు కెనడా దేశాలు ఆంక్షలు విధించాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్నందున దక్షిణ ఇంగ్లాండ్ లో క్రిస్మస్ షాపింగ్ మరియు సమావేశాలను తప్పనిసరిగా రద్దు చేయాలని బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించిన కొన్ని గంటల తరువాత ప్రయాణ నిషేధాన్ని ప్రకటించారు.