కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై అమెరికా స్పందించింది. రాహుల్ గాంధీ కేసును తాము గమనిస్తున్నామని తెలిపింది. అయితే, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.
‘‘ఏ దేశ ప్రజాస్వామ్యానికైనా.. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలు. భారత కోర్టుల్లో రాహుల్ గాంధీ కేసును మేం గమనిస్తున్నాం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నాం. మా రెండు దేశాలకు కీలక అంశాలైన ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాముఖ్యతను నిత్యం హైలైట్ చేస్తూనే ఉంటాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు.