న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు తీసిన కరోనా.. బలహీన పడింది. ఆయా దేశాలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు చివరిదశలో ఉన్నా.. ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలతో వైరస్ వ్యాప్తి కొంత మేర తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే వైరస్ ప్రభావం ఎక్కువ లేకపోవడంతో దేశంలో అందరికీ వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదని, వైరస్ బారిన పడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తే సరిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది.
ఇటీవల వ్యాక్సినేషన్ కు సంబంధించి దేశంలో కొందరిని జాబితా నుంచి తొలగించారనే వదంతులపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ్ స్పష్టతను ఇచ్చారు. వ్యాక్సిన్ ప్రధాన లక్ష్యం వైరస్ చైన్ ను తెగ్గొట్టడమేనని, దాన్ని సాధించాలనుకుంటే దేశంలోని ప్రతిఒక్కరికి వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారు, లక్షణాలు ఉన్నవారికి తప్ప మిగిలిన వారికి టీకా అందించడం కుదరదన్నారు.
వాస్తవాల ఆధారంగా చర్చలు కొనసాగిస్తామన్నారు. దేశ జనాభాలో వైరస్ ప్రభావితులకు మాత్రమే టీకా అందిస్తామన్నారు. కరోనా నుంచి కాపాడుకోవాలని అనుకుంటే తప్పనిసరిగా మాస్కు ధరించాలని బలరాం భార్గవ్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ పై వస్తున్న వదంతులు ఎవరూ నమ్మవద్దని, అధికారిక ప్రకటన ఇస్తేనే ప్రజలు నమ్మాలని సూచించారు. ఈ బాధ్యత కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కాదని, వ్యాక్సిన్ తయారీదారులపై కూడా ఉందని పేర్కొన్నారు.
ఇటీవల చెన్నై వాలంటీర్ పై ఆక్స్ ఫర్డ్ టీకా దుష్ర్పభావం కలిగించిందన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో టీకాను నిలిపివేయాలన్నారు. ఈ విషయంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆక్స్ ఫర్డ్ టీకాపై వస్తున్న ఆరోపణల కారణంగా టీకా అభివృద్ధి ప్రక్రియలో ఎలాంటి మార్పులు జరగదని, నిర్ణీత కాలవ్యవధిలోనే టీకా ప్రయోగాలు పూర్తవుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా టీకా అత్యంత సురక్షితమైందని, టీకా సురక్షితమని తేలాకే ప్రజలకు అందిస్తామని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రకటించింది.