ఇటీవల కాలంలో బీజేపీ, వరుణ్ గాంధీ మధ్య గ్యాప్ ఏర్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరుణ్ గాంధీ ప్రజాసమస్యలపై సొంత పార్టీనే ఇరుకున పెట్టేలా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తాజాగా ప్రధాని మోదీకి వరుణ్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. నిన్న ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ రైతుల సమస్యలపై కేంద్రం ముందు 4 డిమాండ్లను ప్రతిపాదించాడు.
రైతు చట్టాలను ముందే వెనక్కి తీసుకుంటే 700 మంది రైతుల ప్రాణాలు పోయివి కావని లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో మరణించిన రైతులకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతులపై బనాయించిన కేసులను ప్రభుత్వం ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఎంఎస్పీ డిమాండ్ నెరవేర్చే వరకు రైతు ఉద్యమం ఆగదని హెచ్చిరించారు. మరోసారి యూపీ లఖీంపూర్ ఖేరీ ఘటనను లేఖలో ప్రస్తావించారు. ఘటనకు బాధ్యులైన వారిని త్వరగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
యూపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంత పార్టీ ఎంపీనే ఇలా లేఖలు రాయడం, వ్యాఖ్యలు చేయడం బీజేపీని కలవరపరుస్తున్నాయి. వరణ్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ పీలీభిత్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు.