వండుకోవడానికి టైమ్ లేదు.. ఒక్కోసారి టైమ్ ఉన్నా వంట చేసే మూడ్ ఉత్సాహం లేక ఆర్డర్ చేసుకుని తినడం అలవాటైపోయింది. నగరాల్లో ఉండేవారికి ఏం కావాలన్నా ఆర్డర్ పెడితేచాలు గంటల వ్యవధిలో వచ్చేస్తాయి. స్విగ్గీ, జొమాటోలో మీరు కూడా ఎప్పుడూ ఏదో ఒకటి ఆర్డర్ చేసుకునే ఉంటారు. కానీ సంవత్సరం మొత్తం మీద ఎంత ఖర్చుపెట్టి ఉంటారు ఈ ఆర్డర్స్ మీద.. మహా అయితే 20- 50 వేలు అంతేనా.. కానీ ఓ వ్యక్తి..జొమాటోలో రూ. 28 లక్షలకు పైగా విలువైన ఆర్డర్లు చేశాడు.
2022 సంవత్సరంలో జొమాటోలో ఒకేసారి రూ.25,000 కంటే ఎక్కువ విలువైన పిజ్జాలను ఆర్డర్ చేశారు. సంవత్సరంలో ఎక్కువగా జొమాటో నుంచి ఆర్డర్ చేసిన వ్యక్తికి సంబంధించి జొమాటో ట్విట్టర్‌లో ఓ పోస్ట్ కూడా చేసింది. పూణేకి చెందిన వ్యక్తి 2022లో జొమాటో నుంచి రూ.28 లక్షలకు పైగా విలువైన ఆర్డర్లు చేశాడట.
అతను ఖర్చు చేసిన మొత్తం ట్విట్టర్ ధర కంటే కేవలం రూ. 36,42,17,44,48,38 తక్కువని జొమాటో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫన్నీ పోస్ట్ చేసింది. ఇంత మొత్తంలో ఆర్డర్ చేసిన జొమాటో కస్టమర్‌ని పూణేకు చెందిన తేజస్‌గా గుర్తించారు. పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన వారిలో మొదటి స్థానంలో తేజస్, రెండో ప్లేస్‌లో ఢిల్లీకి చెందిన అంకుర్ ఉన్నాడు. అతను ఈ ఏడాది జొమాటోలో 3,300 ఆర్డర్లు ఇచ్చాడు. రాహుల్ అనే మరో కస్టమర్ జొమాటో యాప్ ద్వారా 1,098 కేక్‌లను ఆర్డర్ చేశాడు.
రవివర్ అనే వ్యక్తి 2022లో రూ.6.96 లక్షల విలువైన డిస్కౌంట్లను పొందినట్లు జొమాటో తెలిపింది. సూరత్‌కు చెందిన యష్ అనే వ్యక్తి తన ఆర్డర్‌ను స్వీకరించిన ప్రతిసారీ జొమాటో చాట్ సపోర్ట్‌లో థాంక్యూ అని మెసేజ్ చేశారట.. అసలు మీరు ఎప్పుడైనా ఇలా చేశారా..? 2022లో జొమాటోలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్(GOAT)గా బిర్యానీ నిలిచింది. ప్రతి నిమిషానికి 186 బిర్యానీలను డెలివరీ చేసినట్లు జొమాటో తెలిపింది. స్విగ్గీ తన 2022 ట్రెండ్‌లను డిసెంబర్ మధ్యలోనే వెల్లడించింది. స్విగ్గీ స్టాండ్ అవుట్ కస్టమర్లలో ఇద్దరు బెంగళూరుకు చెందినవారు ఉన్నారు.