లాక్ డౌన్ పుణ్యమా అని దేశ ప్రజలు బ్రతికి ఉండగానే నరక౦ చూస్తున్నారు. కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ అంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయింది. కరోనా దెబ్బకు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే జనాల గుండెల్ల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ వాసులను కరోనా భయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటే చాలు వాళ్ళు భయపడిపోతున్నారు.
ఏకంగా బెజవాడ లో 18 కరోనా కేసులు నమోదు కావడంతో జనాలు బయటకు రావాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో విజయవాడ మున్సిపల్ కమీషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో కూరగాయల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు, వీలైనంత ఎక్కువ మందికి కూరగాయలను అందించే ఉద్దేశంతో విజయవాడ మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వేంకటేశ్ వినూత్న ఆలోచన చేసారు.
సిటీ బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చడానికి గానూ వాటిని అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పట్లో కరోనా తగ్గే అవకాశం లేదు కాబట్టి… ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని, నిన్న ప్రయోగాత్మకంగా సంచార రైతు బజార్లను నిర్వహించారు. దీనికి మంచి స్పందన లభించడంతో… ఆర్టీసీ బస్సుల ద్వారా నగరంలోని 53 డివిజన్ల పరిధిలో కూరగాయలు విక్రయించాలని యోచిస్తున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, తొలి రోజు 8 క్వింటాళ్ల కూరగాయలు విక్రయించామని, దీని ద్వారా ప్రజలు గుమి గూడె అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.