ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) దేశంలోని వాహనదారులకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై వాహనదారులు తమ వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకుంటే కచ్చితంగా పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాల్సిందేనని తెలిపింది. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే ఇన్సూరెన్స్‌ను జారీ చేయాలని సూచించింది. సుప్రీం కోర్టు ఆగస్టు 2017లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఐఆర్‌డీఏఐ తాజాగా మరోమారు ఈ ఆదేశాలను జారీ చేసింది.
నిజానికి ఇదే విషయంపై ఐఆర్డీఏఐ జూలై 2018లోనే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీలు, వాహనదారులు ఈ నిబంధనను పాటించడం లేదు. అయితే ఇకపై ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. 2019 మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలను పాటించని వాహనాలపై రూ.10వేల వరకు జరిమానా విధించాలని చట్టంలో చేర్చారు. అయితే ఆ చట్టాన్ని దేశంలో కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. దీని వల్ల వాహనదారులు తమ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
కాగా వాహనదారులు ప్రతి 6 నెలలకు ఒకసారి తమ వాహనాలకు కచ్చితంగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) టెస్టు చేయించాలి. వాహనాల నుంచి వెలువడే పొగలోని ఉద్గారాలైన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్‌లను అందులో టెస్టు చేస్తారు. ఓకే అనుకుంటే సర్టిఫికెట్ ఇస్తారు. దానికి 6 నెలల పాటు వాలిడిటీ ఉంటుంది. అయితే ఇక వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకుంటే వాహనదారులు కచ్చితంగా ఈ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.