ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా వక్రీకరించి మాట్లాడటమే ప్రతిపక్షాల పనైపోయింది అని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా పై ప్రతి ఒక్కరూ ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నారు, అలాగే జగన్ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యత వహించి ప్రధాని మోదీ మొదలుకుని ప్రతీ ఒక్కరూ చెప్పే వాటినే సీఎం జగన్ చెప్పారని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. కరోనా పై జగన్ కు పూర్తి అవగాహన ఉందని అన్నారు.
చంద్రబాబు నాయుడు మాత్రం కరోనా పట్ల ప్రజలలో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని వెల్లంపల్లి అన్నారు. ప్రజలకు ధైర్యాన్ని నింపాల్సింది పోయి ప్రజల్లో ఆందోళన కలిగించే రీతిలో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే బాధేస్తోందని వ్యాఖ్యానించారు. కరోనా అడ్డుపెట్టుకుని ఎన్నికలు ఉద్దేశ పూర్వకంగానే నిలిపివేశారు అని ఇదంతా చంద్రబాబు దగ్గరుండి చేశారని ఆయన అన్నారు.
వారం రోజులు పోతే ఎన్నికలు అయిపోయేవని, తరువాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, వీటన్నింటినీ చంద్రబాబు దురుద్దేశంతో నిలిపివేశారని మంత్రి తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మినారాయణ ముగ్గురు కూడా వేరు గా కనిపిస్తున్నప్పటికీ వీరి ధ్యేయం ఒకటే అని, జగన్ కు ఇబ్బంది కలిగించడమే వీరి ధ్యేయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయాన్ని తెలిపి అక్కడ తమకు తప్పక న్యాయం జరుగుతుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధీమా వ్యక్తంచేశారు.