సమాజం సజావుగా నడవడంలో బీసీల పాత్ర ఎంతో కీలకమైనదని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. ప్రభుత్వం నాయిబ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఒక్కో కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేసిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయా వర్గాలకు చెందిన వారితో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి రజకులు, నాయిబ్రాహ్మణులు, టైలర్లు, రజకులతో కలిసి ఎమ్మెల్యే క్షీరాభిషేకం చేశారు.
అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీలకు ఎంతో ద్రోహం చేశారని తెలిపారు. నాయిబ్రాహ్మణులను తోక కత్తిరిస్తానని, మత్స్య కారులను తోలు వలుస్తానంటూ గతంలో దూషించిన దుస్సంస్కృతి చంద్రబాబు నాయుడిదని మండిపడ్డారు. తమ ముఖ్యమంత్రి బీసీలకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. ఒక బీసీ కులానికి చెందిన ఎమ్మెల్యేగా తమ ప్రభుత్వం బీసీలకు ఎంత ప్రత్యేక స్థానం కల్పిస్తున్నదో తనకు తెలుసనని వెల్లడించారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్లో ఎక్కువ శాతం మంది బీసీలే ఉన్నారని, వీరికి ఏడాది కిందటి వర్గాలు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని తెలిపారు. ఇలాంటి వారందరని గుర్తించి, ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేస్తుండటం హర్షణీయమని కొనియాడారు.