కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కరోనా సోకి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా మంది మృతి చెందారు. ఎన్నో లక్షల మంది కరోనాతో బాధపడుతున్నారు. దాదాపుగా ప్రతి దేశంలోనూ కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే చైనాకు పక్కనే ఉన్న వియత్నాంలో మాత్రం కరోనా కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. అంతే కాదు.. ఇప్పటి వరకు కరోనా కారణంగా అక్కడ ఎవరూ మృతి చెందకపోవడం మరొక విశేషం. ఇక ప్రస్తుతం అక్కడ దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. దీంతో అక్కడి ముఖ్య పట్టణమైన హనొయ్‌తోపాటు ఇతర పట్టణాల్లోనూ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అయితే వియత్నాం ఈ ఘనతను ఎలా సాధించింది..? కరోనా కట్టడికి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? అంటే…
వియత్నాంలో సుమారుగా 9.70 కోట్ల జనాభా ఉంటుంది. ఆ దేశం చైనాకు పక్కనే ఉంటుంది. అయినప్పటికీ అక్కడ కరోనా కేసులు తక్కువగా ఉండడమే కాదు.. ఇప్పటి వరకు అక్కడ కరోనా కారణంగా ఒక్కరు కూడా మృతి చెందలేదు. వియత్నాంలో 270 కరోనా కేసులు నమోదు కాగా.. 225 మంది ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు. మిగిలిన వారికి చికిత్స అందుతోంది. ఇక కరోనా మరణాలు అక్కడ సున్నా. అయితే ఈ ఘనతను సాధించడానికి ఆ దేశం చేపట్టిన పకడ్బందీ చర్యలే కారణమని చెప్పవచ్చు.
వియత్నాంలో జనవరి చివరి వారం నుంచి అన్ని ప్రాంతాల సరిహద్దులను మూసివేశారు. ఫిబ్రవరి మధ్య నుంచే జనాలందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండమన్నారు. ఒక్కరిని కూడా బయటకు అనుమతించలేదు. ఈ క్రమంలో ప్రజలకు కావల్సిన సరుకులను ఇండ్లకే తెచ్చి ఇచ్చారు. అలాగే ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లు, టెక్నాలజీని ఎక్కువగా వాడుకుంది. దీంతో ప్రభుత్వం ప్రజలకు కరోనా గురించి బాగా కమ్యూనికేట్ చేయగలిగింది. కరోనాపై ఎప్పటి కప్పుడు సమాచారం అందించడంతోపాటు.. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను.. ప్రజలు పాటించాల్సిన నియమాలను ఎప్పటికప్పుడు అక్కడి అధికారులు ప్రజలకు కమ్యూనికేట్ చేశారు. దీంతో ప్రజలు విధిగా ఆ నియమాలను పాటించారు.
ఇక టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్ అనే నమూనాను వియత్నాం అనుసరించింది. కరోనా సోకిన వ్యక్తులను పూర్తిగా ఐసొలేషన్‌లో ఉంచారు. వారితో కాంటాక్ట్ అయిన వివరాలను సేకరించి వారికి పరీక్షలు జరిపారు. పాజిటివ్ వచ్చిన వారిని కూడా ఐసొలేషన్‌లో ఉంచారు. ఇక కరోనా వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న వివరాలను ట్రేస్ చేశారు. వారిని ఐసొలేషన్‌లో ఉంచారు. అలాగే తాము సొంతంగా తయారు చేసుకున్న టెస్టు కిట్ల ద్వారా కేవలం 90 నిమిషాల్లోనే కరోనా నిర్దారణ పరీక్షలు చేయగలిగారు. ఈ క్రమంలో కరోనా రోగులకు త్వరగా చికిత్స అందించారు. దీంతో చాలా మంది ఎమర్జెన్సీ పరిస్థితికి చేరుకోకుండానే కరోనా నుంచి కోలుకున్నారు. ఇలా వియత్నాం కరోనాను విజయవంతంగా ఎదుర్కొంది. ఆ మహమ్మారిని కట్టడి చేసి దానిపై గెలిచింది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ 3 జిల్లాలు మినహా ఆ దేశం మొత్తం లాక్‌డౌన్‌ను 100 శాతం ఎత్తేశారు. దీంతో అక్కడ యథావిధిగా అన్ని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. త్వరలో పాక్షికంగా లాక్‌డౌన్ ఉన్న 3 జిల్లాల్లోనూ లాక్‌డౌన్‌ను ఎత్తేయనున్నారు. దీంతో కరోనాపై గెలిచిన దేశంగా వియత్నాం గుర్తింపు పొందనుంది..!