స్త్రీలకు నెలసరి సెలవులపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విధానపర అంశాల్లో (ప్రభుత్వ పాలసీలు) రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీంకోర్టును కొందరు వ్యక్తులు కోరడం ఈమధ్య ఎక్కువైపోయింది. ప్రభుత్వాలు మాత్రమే నిర్ణయాలు తీసుకుని, అమలు చేయాల్సిన విషయాల విచారణకు వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు నిరాకరిస్తున్నాయని తెలిపారు.
ఇలాంటి అంశాల్లో నేరుగా కార్యనిర్వాహక ప్రభుత్వాలను అభ్యర్థించాల్సిన వ్యక్తులు, సంస్థలు ఆయా విషయాలపై ఉన్నత న్యాయస్థానాలకు ఎక్కడం కోర్టుల సమయం వృధాచేయడమేననే అభిప్రాయం న్యాయవ్వస్థలో బలపడుతోంది. తాజాగా, శుక్రవారం సుప్రీంకోర్టు– మహిళలకు వేతనంతో కూడిన నెలసరి (పీరియడ్స్) సెలవల మంజూరుపై ఈ విషయాన్నే స్పష్టంచేసింది. విధానపరమైన ఈ విషయంలో పిటిషన్‌దారు శైలేంద్రమణి త్రిపాఠీ కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖకు ఈ మేరకు విన్నవించుకోవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. ఉద్యోగాలు చేసే స్త్రీలు, చదువుకునే మహిళలు నెలసరి (2 నుంచి 5 రోజులు) సమయంలో నొప్పితో బాధపడతారని, అందువల్ల వారికి వేతనంతో కూడిన సెలవలు మంజూరు చేయాలని రాష్ట్రాలను ఆదేశించాలని సుప్రీంకోర్టును పిటిషనర్ అభ్యర్థించారన్నారు.
బిహార్‌లో 1992 నుంచి స్త్రీలకు నెలసరి సెలవల మంజూరు విధానం అమలవుతోందని, కేరళలో కూడా అమలుకు రాష్ట్ర సర్కారు నిర్ణయించిందని పిటిషనర్ తెలిపారు. అయితే, మహిళలకు ఇలాంటి సెలవలు నెలనెలా ఇస్తే అనేక సంస్థలు, కంపెనీలు ఇక ముందు స్త్రీలను పెద్ద సంఖ్యలో తీసుకుని, ఉద్యోగాలివ్వడానికి ఇష్టపడకపోయే ప్రమాదం ఉందని లా విద్యార్థి ఒకరు సత్య మిత్రా అనే లాయర్ ద్వారా కోర్టుకు వివరించారు. ఈ వాదన విన్న చంద్రచూడ్ బెంచీ ఇందులో గుర్తించాల్సిన అంశం ఉందని పేర్కొంది. లక్షలాది మహిళలకు సంబంధించిన ఇటువంటి విధానపర విషయాలపై నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలే కాబట్టి ప్రభుత్వాలనే ఈ అంశాలపై ఏం చేయాలో కోరాలని సుప్రీంకోర్టు బెంచీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు.