దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోదియాను ఇవాళ కోర్టులో హాజరు పర్చనున్నారు. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా సిసోదియాను నిన్న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టులో సిసోదియాను హాజరుపర్చనున్నారు.
సిసోదియా వేరే వ్యక్తుల పేర్ల మీద అనేక ఫోన్ నంబర్లు, ఫోన్లు తీసుకున్నారని, ఆ తర్వాత వాటిల్లో కొన్నింటిని ధ్వంసం చేశారని సీబీఐ వర్గాలు ఆరోపించాయి. ఆయన 18 ఫోన్లు, నాలుగు ఫోన్ నంబర్లు ఉపయోగించేవారని తెలిపాయి. ఒక్క రోజులోనే ఆయన మూడు ఫోన్లను మార్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు.
సిసోదియా అరెస్టుపై సీబీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విచారణకు సహకరించకపోవడం వల్లే ఆయనను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఈ కేసులో సిసోదియా నుంచి రాబట్టాల్సిన సమాచారం ఎంతో ఉన్నందున.. ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ.. న్యాయస్థానాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది.