విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని రాజ్యసభలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి. ద్రవ్య వినిమయ బిల్లు పై జరిగిన చర్చలో పాల్గొన్న విజయసాయి రెడ్డి.. ఈ సందర్భంగా కేంద్రంపై ఆగ్రహించారు. ఆంధ్రప్రదేశ్ వి భజన జరిగి ఎనిమిదేళ్ళు కావస్తున్నా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపకాలు జరిగాయని, ఆస్తుల పంపకాల సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్సీపీ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విమర్శించారు.
విభజన చట్టం ప్రకారం న్యాయసమ్మతంగా, ధర్మబద్దంగా, త్వరితగతిన ఆస్తుల పంపిణీ సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసిందని… పరిష్కారంపట్ల కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ చూపకుండా ఏళ్ళతరబడి సాచివేత ధోరణి అనుసరిస్తూ వస్తోందని నిప్పులు చెరిగారు. దీంతో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఆస్తుల పంపిణీ జరపాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని.. ఈ పరిస్థితికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు.