ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు, విద్యార్థులకు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మన రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. శనివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో రెండ్రోజులపాటు జరిగే మెగా జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వైసీపీ ఆధ్వర్యంలో ఇటీవల తిరుపతి, వైజాగ్‌లలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలకు విశేష స్పందన లభించిందని, రెండుచోట్ల 347 కంపెనీలు పాల్గొనగా, 30 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు.
అలాగే, ఏఎన్‌యూలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో 26 వేల ఉద్యోగాలను భర్తీచేసేందుకు ప్రైవేటు రంగంలోని వివిధ రకాల సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు విజయసాయి రెడ్డి. ఇందుకు వైఎస్సార్‌సీపీ జాబ్ పోర్టల్‌లో 97వేల మంది నిరుద్యోగ యువత నమోదు చేసుకున్నారని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో తిరుపతి, వైజాగ్, గుంటూరు జిల్లాల్లో మెగా జాబ్‌మేళాలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు విజయసాయిరెడ్డి వెల్లడించారు.