ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ మధ్య చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి జనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సంధించారు. అయితే లోకేశ్ చేసిన ట్వీట్ల స్ర్కీన్ షాట్లను పోస్ట్ చేస్తూ… గట్టి కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి! అదేమంటే.. “బాబూ లోకాయ్… స్టాన్ ఫర్డ్, కార్నెగీల్లో చదువుకున్నానని అంటావ్.. సొంత పేర్లతో ఉన్న కంపెనీలను సూట్ కేస్ కంపెనీలు అనరు నాయనా… కాస్త లోకజ్ఞానం నేర్చుకో లోకాయ్” అంటూ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ఎద్దేవా చేశారు.
అదేవిధంగా “లోకాయ్… మీ నాన్న పీఎస్ ఇంటి మీద రైడ్ తర్వాత, 2,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బు అక్రమ మార్గాల్లో లాగేశారన్న నిజాన్ని ఐటీ శాఖ ప్రకటించింది. మొన్న ఢిల్లీలో ఎంపీల్ని రాష్ట్రపతి వద్దకు పంపటానికి అసలు కారణం అదేనా? ఆ 2,000 కోట్లు నువ్వు తిన్నావా, మీ నాన్న తిన్నాడా? లేక జాయింట్ అకౌంటా?” అని విజయసాయిరెడ్డి వెటకారాస్త్రాన్ని సంధించారు. దీంతో… విజయసాయిరెడ్డిని టీడీపీ నేతలు కదిపి మరీ తిట్టించుకుంటున్నారు అనే కామెంట్లు పడుతున్నాయి.
అయితే విజయసాయిరెడ్డి.. ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం లేకపోలేదు! తాజాగా నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ట్విట్టర్ లో వైసీపీ అగ్రనేతలపై ధ్వజమెత్తారు. వైసీపీ ఏ1, ఏపీ2 అంటూ రెచ్చిపోయారు. ఆయనేమన్నారంటే.. “బాలినేనితో పాటు, చెన్నైలో ఒకే అడ్రెస్ మీద ఉన్న మూడు సూట్ కేసు కంపెనీల డైరెక్టర్లు… వీళ్లంతా చెన్నై కేంద్రంగా ఏం చేస్తున్నట్టు? డబ్బు అక్రమరవాణా ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇప్పటివరకు ఎంత డబ్బు రాష్ట్రం దాటింది? హవాలా, మనీలాండరింగ్, సూట్ కేసు కంపెనీలు, పేరు ఏదైనా ప్రజాధనం దోపిడీలో వైఎస్ జగన్ రూటే సపరేటు” అంటూ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.
అంతటితో ఆగకుండా “ఏపీలో కొల్లగొట్టిన కోట్లకొద్దీ నల్లధనాన్ని వైసీపీ నేతలు ఎమ్మెల్యే స్టిక్కర్లు అంటించిన కార్లలో చెన్నైకి చేరవేస్తున్నారన్నది బయటపడింది. ఇలా వెళ్తున్న డబ్బు ఎవరిది? ఆ డబ్బు చెన్నై నుంచి హవాలా మార్గంలో మారిషస్ కు వెళ్ళేది నిజమేనా? ఇవిప్పుడు తేలాలి” అన్నారు. అలాగే.. “హవాలాకు కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఇ-మెయిల్ అడ్రస్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిది. పైగా ఈ సంస్థను వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019 సెప్టెంబర్ 20న రిజిస్టర్ చేసారు. అంటే అది సూట్ కేసు సంస్థ అన్నట్టే కదా.. అక్రమంగా దోచుకోవడం, సూట్ కేసు సంస్థలు పెట్టి వాటిల్లోకి మళ్ళించడం, అక్కడ నుంచి హవాలా మార్గంలో డబ్బును విదేశాలకు తరలించడం… ఏ-1, ఏ-2ల గత చరిత్ర మొత్తం ఇదే! ఇప్పుడూ అదే నడుస్తోంది. ఈ మొత్తం తతంగంపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి” అంటూ నారా లోకేష్ ట్వీట్ల వర్షం కరిపించారు. దీనిపై విజయసాయిరెడ్డి ఈరేంజ్ లో కౌంటర్ ఇచ్చారు!! ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ ట్విట్టర్ వారే హాట్ టాపిక్!!